బ్రహ్మచర్య వ్రతము: విద్యార్ధి – బ్రహ్మచారి. విద్యార్ధికి పర్యాయపదము బ్రహ్మచారి. అతను బ్రహ్మచర్యమును స్వచ్ఛందముగా పాటించవచ్చు. అయినప్పటికి విద్యార్ధియొక్క బ్రహ్మచర్యము మిగతా బ్రహ్మచారులలా కాకుండ ఇది అతని గురువులచేత అమలు చెయ్యబడుతుంది. బ్రహ్మచారికి మనుస్మృతి చెబుతున్న నియమములు చూద్దాము,
సేవేతేమాంస్తు నియమా బ్రహ్మచారీ గురౌ వస
సన్నియమ్యేంద్రియగ్రామం తపోవృద్ద్యర్థమాత్మన:
“విద్యార్ధి (బ్రహ్మచారి) గురుకులములోనే వసించవలెను. (గురు కులము అనగా అసలు అర్ధము గురు గృహము). బ్రహ్మచారి ఇంద్రియములను నిగ్రహించుకుని అతని మనస్సు మొత్తము విద్య లేక జ్ఞాన సముపార్జనయందే కేంద్రీకృతము చేయవలెను.”
….( ఈ పేజీ లోని అంశములు నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేదకాల సమాజము) ” అను పుస్తకములోనిది. అధ్యాయము 20, ‘విద్యార్ధి – బ్రహ్మచారి’)
వర్జయేన్మధుమాంసం చ గంధం మాల్యం రసా స్త్రియ:
శుక్తాని యాని సర్వాణి ప్రాణినాం చైవ హింసనమ్
“విద్యార్ధి మధు మాంసములయందు ప్రీతి వదలవలెను. తేనె రుచి చూడకూడదు. కర్పూరము, చందనముల వాసన చూడకూడదు. పువ్వులు ధరించకూడదు. లైంగిక కార్యములో పాల్గొనకూడదు. లైంగిక విషయ యోచన కూడా చెయ్యకూడదు. నిలువ ఉంచిన పదార్ధములు (మత్తు పానీయములు) సేవించరాదు. జీవులకు అపకారము చెయ్యకూడదు.” ఇలా చాలా నియమములు ఉన్నాయి. విద్యార్ధి బిచ్చమెత్తుకుని ఉదరపోషణ చెయ్యవలెను. స్వంత వంట చేసికొనకూడదు. మొదటి పూట బిక్ష స్వీకరించిన ఇంటిలో రెండవ పూట ఆహారము గైకొనకూడదు.
స్వకుటుంబ గృహములో బిచ్చము గైకొనకూడదు. ఇలా శారీరక అవసరములను, మానసిక వ్యామోహములను నియంత్రించడమువలన విద్యార్ధికి తన మనసుపై తనకు అదుపు సాధ్యమవుతుంది. అతను విద్య సముపార్జనపై తన మనసును కేంద్రీకృతము చేసి వేదములను సులభముగా చదువగలుగుతాడు. ఈ క్రమములో అతనిలోని స్వార్ధ చింతన తగ్గడముతో అతనికి దైవకృప తోడవుతుంది. అతను వేదములను ఆకళింపుచేసుకోవడములో నిష్ణాతుడు అవుతాడు. అథర్వణ వేదములో బ్రహ్మచారి ప్రళయ కాలములో నీటిలో మునిగి కొట్టుకు పోకుండా నీటిపై తేలియాడతాడు అనిచెబుతుంది,
ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణుతే గర్భమన్తః
తం రాత్రీ స్తిస్ర ఉదరే బిభర్తి తం జాతం ద్రష్టుమభిసంయన్తి దేవాః
“ఆచార్యులు శిశువు జన్మించిన తరువాత మూడు రోజులు (రాత్రులు) ఆ పిల్లవాడిని కనిపెడుతూ ఉండాలి. వారు తృప్తిచెందిన తరువాత ఆ పిల్లవానిని దేవతలకు చూపించవలెను.” విద్యార్ధులను పాఠశాలలో చేర్చుకోవడము ఇప్పటిలాగానే కొంత కసరత్తు తో కూడుకుని ఉండేది. ఆచార్యులు పిల్లవాడిని పుట్టినప్పుడే వారి దివ్య జ్ఞానముతో ఎంపిక చేసేవారు. విద్యార్ధి తన విద్యాభ్యాసము పూర్తిచేసిన తరువాత అతను నిత్యము తాను ధరిస్తూవస్తున్న కృష్ణాజినము, జులపాల జుట్టు త్యజించి సాధారణ గృహస్థాశ్రమములోకి ప్రవేశించవచ్చు. ఆ తరువాత అతను తాను నేర్చుకున్న విషయములను నలుగురిని పిలచి అందరికి ఎరుకపరుస్తు ఉండవలెను,
బ్రహ్మచర్యేతి సమిధా సమిధ్ధః కార్ష్ణం వసానో దీక్షితో
దీర్ఘశ్మశ్రుః స సద్య ఏతి పూర్వస్మాదుత్తరం
సముద్రం లోకాన్త్సంగృభ్య ముహురాచరిక్రత్
“విద్యాభాసము పూర్తిచేసుకుని తన గురువులకు తన శక్తిననుసరించి గురుదక్షిణ చెల్లించి గురువుగారి వద్దనుండి అనుమతి పొంది గృహస్తాశ్రమములో ప్రవేశించవలెను.”
ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః
“పితృ ఋణము తీర్చుకొనడానికి, ధర్మమను నిర్వర్తించడానికి, సంసార సుఖము కోరి భార్యను పొంది గృహస్తాశ్రమ ములో ప్రవేశించవలెను.”
ధర్మ ప్రజా సంపత్యర్ధం రతిసుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహే
మహర్షి పితృదేవానాం గత్వా నృణ్యం యధావిధి
పుత్రే సర్వం సమాసజ్య వ సేన్మాధ్యస్ధ్యమాశ్రితః
విద్యాభ్యాసము ద్వారా ఋషి ఋణము తీర్చుకున్నట్లే, గృహస్తాశ్రమము స్వీకరించి పుత్రులను బడసి పిత్రు ఋణమును తీర్చుకొనవలెను. బ్రహ్మచర్యమలంభిస్తూ వేదాధ్యయనమునకు నడుము కట్టుకుని తమ వంట తాము చేసుకొనని బ్రహ్మచారులకు, మునులకు, ఋషులకు గృహస్తులు తక శక్తికొలదిబిక్షనొసంగి ఉపచర్యములు చేయవలెను.
శక్తితో పచమానేభ్యో దాతవ్యం గృహమేధినా
సంవిభాగశ్చ భూతేభ్యః కర్తవ్యో నుపరోధతః
వంట చేయక భోజనము సంపాదించెడి బ్రహ్మచారి, సన్యాసి మున్నగువారికి దనకుటుంబ పోషణకు లోపము లేకుండ శక్తికొలది భిక్ష మిడవలయును. వృక్షములు మున్నగు సకలభూతములను నీరుపోయుట మొదలగువానితో దృప్తి సేయవలయును. బ్రహ్మచారి వేదములను అభ్యసించినతరువాత గృహస్తాశ్రమములో చేరి తాను నేర్చుకున్న వేద జ్ఞానమును నలుగురికి ఎరుకపరచవలెను. కొంతమంది బ్రహ్మచారులు గృహస్తాశ్రమమును త్యజించి జీవితాంతము బ్రహ్మచారులుగా ఉండిపోవచ్చు. వారే ఋషులుగా పరిణామము చెందుతారు. దీనినే వానప్రస్తము అంటారు. ఇలా ఎవరివంతు కృషి వారు చేస్తూ ఆశ్రమ ధర్మములను పాటిస్తు సనాతన ధర్మమును సజీవము గావించిన ప్రాచీనులకు జోహార్లు. తదుపరి అధ్యాయములో గృహస్థాశ్రమమ ప్రశస్తిగురించి తెలుసుకుందాము.
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )