సత్యలోకం మరియు ఋషిదేశం
మన ప్రాచీన హిందూ గ్రంథాలు మన దేశాన్ని సత్యలోకం మరియు ఋషిదేశం గా పేర్కొంటాయి. పద వ్యుత్పత్తి రీత్యా ‘లోకం’ అంటే ప్రపంచం అని, ‘సత్యం’ అంటే నిజం అని అర్థము. అదే విధంగా, ‘ఋ’ అక్షరం కూడా సత్యాన్నే సూచిస్తుంది. ఆ విధంగా ఋషులు అంటే కేవలం సత్యాన్నే పలికే మహా పురుషులు అని అర్థం చేసుకోవాలి. ప్రాచీన భారత దేశం లో ఋషులు జీవించారు కాబట్టి భారతదేశాన్ని ఋషిదేశం అని పిలిచేవారు. మరియు అక్కడి జనులు కూడా సత్యాన్నే పలికేవారు, అందుకే ప్రాచీన భారతదేశాన్ని సత్యలోకం అని కూడా పిలిచేవారు.
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః
యోనాక్రమంత్రుషయో హ్యాప్తకామా
యత్ర తతః సత్యస్య పరమం నిదానం – ముండక ఉపనిషద్
అర్థం: గెలుపు ఎల్లప్పుడూ సత్యానిదే. అసత్యం పరాజయం పొందుతుంది. సత్య మార్గమే దేవ మార్గము. సత్యమార్గము జ్ఞానోదయమునకు దారి తీస్తుంది. సత్యమే గెలుస్తుంది, అసత్యం కాదు. సత్యం మాత్రమే దైవిక మార్గాన్ని తెరుస్తుంది, ఋషులు మరియు సాధువులు సత్యమార్గాన్ని ఎంచుకుని పరమ దివ్యమైన సత్యలోకాన్ని చేరుకుంటారు.
సత్యమేవ జయతే అనే ఈ ఉపనిషత్తు సూక్తిని మన జాతీయ నినాదంగా స్వీకరించినందుకు భారతీయులు గర్వించదగిన విషయము. వాస్తవానికి, ఇది ముండక ఉపనిషత్తు నుండి స్వీకరించబడింది.
ప్రాచీన విదేశీ రచయితలు మరియు సమకాలీన పరిశీలకులు భారతీయులను వారి నిజాయితీ పరమైన జీవన విధానాన్ని పలు విధాలుగా ప్రశంసించారు. విదేశీ రచయితల రచనల నుండి కొన్ని ఉల్లేఖనలు ఇక్కడ ఇస్తున్నాను.
…
స్ట్రాబో
భారతీయులు చాలా విశ్వసనీయులు, వారికి దొంగల భయం లేదు, వారి ఇళ్ల తలుపులకు తాళాలు వేసుకోరు. వ్యాపారంలో వారి నిజాయితీని నిబద్ధతను నిర్ధారించుకోవడానికి వారితో వ్రాతపూర్వక ఒప్పందాలు అవసరం లేదు. – స్ట్రాబో (63 BCE-24 CE).
మార్కో పోలో
భారతీయులు ఇసుకవేస్తే రాలనంత మంది మిక్కిలిగా లెక్కలేనంత మంది ఉన్నారు, నిజాయితీ లేనితనం మరియు దురాక్రమణకు దూరంగా ఉంటారు. వారు చావుకు గానీ, జీవితానికి గానీ భయపడరు… భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వ్యాపారులు మరియు అత్యంత నిజాయితీపరులు అని మీరు గ్రహించాలి, ఎందుకంటే వారు దేని కోసమైనా అబద్ధం చెప్పరు. – మార్కో పోలో (క్రీ.శ. 1254-1295)
అబుల్ ఫజల్
హిందువులు సత్యం పట్ల గాఢమైన గౌరవాన్ని కలిగి ఉంటారు మరియు వారి అన్ని వ్యవహారాలలో అచంచలమైన విధేయతను ప్రదర్శిస్తారు. – అబుల్ ఫజల్ (క్రీ.శ. 1551-1602)
మాక్స్ ముల్లర్
సత్యం పట్ల ఉన్న ప్రేమ భారతదేశంతో సంబంధం పెట్టుకున్న అన్ని దేశాలను ఆకర్షించింది, ఇది ఆ దేశ ప్రజల జాతీయ స్వభావంలో ఒక ముఖ్యమైన లక్షణంగా నిలిచింది. – మాక్స్ ముల్లర్ (క్రీ.శ. 1823-1900)
ఆచార పరమో ధర్మః
ఇతర ప్రపంచ మతాల మాదిరిగా కాకుండా, హిందూ మతం ఒక ఖచ్చితమైన మత గ్రంథంపై ఆధారపడి లేదు. ఇది మతపరమైన సంఘముల నుండి వచ్చిన ఏ మతాధికారులచే నిర్వహించబడదు. భారతీయ సమాజ పరిణామం క్రమం వేల సంవత్సరాలుగా జరిగింది. హిందూ మతాన్ని అనుసరించడానికి కఠినమైన సూత్రాలు లేవు. దేశ (దేశం), కాలమానం (సమయం మరియు కాలం) మరియు పరిస్థితి (పరిస్థితులు) ఆధారంగా చట్టాలు మారాలని మనుస్మృతి చెబుతుంది. ఇది ఖచ్చితంగా మానవీయమైన అంశము. ఇది భారతీయ హిందూ మతం యొక్క మూల భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆచార పరమో ధర్మః అను మనుస్మృతి సిద్దాంతం పై ఆధారపడి ఉంటుంది. అంటే, ఒక నిర్దిష్ట సమాజం యొక్క ఆచారాలకు సార్వత్రిక ధర్మ మార్గదర్శకాల కంటే ప్రాధాన్యత నివ్వాలి. అలాగే ఎవరి స్వంత మతాచారాలను వారు పాటించుకుంటూ ప్రధాన సంస్కృతిలో అంతర్భాగంగా అందరు మసులుకోవాలి అని అర్థము.)
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)