త్రిఋణములు
మానవుడు ఈ భూమిపై జన్మించిన తక్షణం అతనికి కొన్ని దైవీయమైన ఋణములు సంక్రమిస్తాయి. వాటినే త్రిఋణములు అని హిందూ ధర్మ శాస్త్రములు చెబుతున్నాయి. అవి వరుసగా దైవ ఋణములు, పితృ ఋణములు, ఋషి ఋణములు. ఈ ఋణములను నివృత్తి చేసుకోవడానికి హిందువులు చతురాశ్రమ ధర్మములను పాటించవలెను. ద్రవ్య, వస్తు రూపముగా ఈ త్రిఋణములను నివృత్తి చేసుకోలేము. ఇవి దివ్య ఋణములు (Eternal debts). త్రిఋణముల గురుంచి మనుస్మృతిలో ఏమి చెప్పారో చూద్దాము:
మహర్షి పితృదేవానాం గత్వా నృణ్యం యధావిధి
పుత్రే సర్వం సమాసజ్య వ సేన్మాధ్యస్ధ్యమాశ్రితః
అర్థము: బ్రహ్మచారిగా వేదాధ్యయనము చేసి ఋషుల ఋణమును, గృహస్థుడుగా పుత్ర సంతతి బడయుటచే పితృ ఋణమును, యజ్ఞములు నిర్వర్తించడము ద్వారా దేవతల ఋణమును తీర్చుకొని యోగ్యుడగు పుత్రుని యందు కుటుంబ భారము నెల్ల నుంచి, తాను మధ్యస్ధుడై యేజోలికి బోక ప్రశాంత జీవితము గడపవలెను.
దైవ ఋణములు
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! దైవఋణములు తీర్చుకోవడనికి యజ్ఞ యాగాదులు నిర్వహించడము ఒక సాధనముగా చెప్పడమయినది. యజ్ఞ తంతులో వైధిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు మొదలయిన వారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకములయిన ద్రవ్యములు, ఆర్ఘ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండలిలొ అగ్నికి ఆహుతి చెయ్యడం జరుగుతుంది. తదుపరి భూత బలులు ఇచ్చి దేవతలకు నైవేద్యము సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతులో సహ జనులకు, అన్నార్తులకు విందు ఏర్పాటు చేయ్యడం ద్వారా సమాజ సేవ జరుగుతుంది అని గమనించాలి. మానవ సేవే మాధవ సేవ అనే నానుడిననుసరించి యజ్ఞ యాగాదులు కూడా సమాజ సేవలోకే వస్తాయి. ఈ విధంగా మనిషి దైవ ఋణములను నివృత్తి చేసుకోవాలి అని నియమము.
పితృ ఋణములు
మాతా పితరులకు హిందువులు ఇచ్చే గౌరవం ఈ పద్యములో ప్రతిబింబిస్తుంది.
మాతాపితరౌన్నిత్యమ్ జన్మనో మమకారిణే
ధర్మాధి పురుషార్ఢేభ్యః ప్రధమం ప్రణామామ్యహమ్
అర్థము: నాకు జన్మనిచ్చి నేను అను అహమును కల్పించి నాకు అస్తిత్వాన్ని ప్రసాదించిన మాతృమూర్తికి, అలాగే ధర్మ అర్థ కామ మోక్షముల సాధన కొరకు నన్ను సన్నద్ధుడిని చేసినందులకు నా పితృదేవునికి నా మాతా పితరులకు ఇద్దరికీ ముందుగా నమస్కారము చేయుచున్నాను.
మాతా పితరులను గౌరవించడము ద్వారాను వారికి సేవలు చేయడము ద్వారాను కొంత ఋణము మాత్రమే నివృత్తి అవుతుంది. అసలు దైవిక పితృఋణము తీర్చుకోవడానికి ఏమి చెయ్యాలో పైన చెప్పిన మనుస్మృతి శ్లోకం చెబుతుంది. మరో శ్లోకం చూద్దాం.
“ధర్మ ప్రజా సంపత్యర్ధం రతి సుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహె”. ఈ వాక్యానికి అర్ధం: ధర్మాన్ని కాపాడడానికి, పిల్లల్ని కనడానికి, రతి సుఖాన్ని పొందడానికి స్త్రీ చేయిని పట్టవలెను.
మన పూర్వీకుల వంశమును అభివృద్ధి పరచడము ప్రతి మానవుని ప్రధాన కర్తవ్యము అని శాస్త్రములు చెబుచున్నవి. ఆ ప్రకారం ప్రతి వ్యక్తి యవ్వన దశలో ఒక స్త్రీని వివాహము చేసుకుని పుత్ర సంతానమును బడయ వలెను. ఆ సంతానమును కుటుంబ, సమాజ సంస్కృతి-సాంప్రదాయములకు అనుగుణంగా పెంచి పెద్ద చేయ వలెను.
వంశాభివృద్ధి చేయడము ద్వారా పితృ ఋణము నివృత్తి అవుతుంది అదే పరంపరలో మానవ కల్యాణము కూడా జరుగుతుంది. అంటే మానవ జాతి మనుగడ నిరంతరము కొనసాగుతుంది. అందుకే ”ప్రజయాహి మనుష్యా పూర్ణాః” అన్నారు. సంతానాభివృద్ధి చేసిన వాడే పరిపూర్ణ మానవుడు అని దీని అర్ధము. అందుకే బ్రహ్మచారి విద్యాభ్యాసము పూర్తి చేసిన తరువాత తన గురువునకు తగిన పారితోషికము సమర్పించి గురువు అనుమతి తీసుకుని గృహస్థాశ్రమము.
లో ప్రవేశించాలి అని శాస్త్ర నిర్ణయము. “ఆచార్యాయ ప్రియమ్ ధనమహ్రుత్య ప్రజాతమ్తుమ్ మవ్యవత్సెత్సిహ్”.
ఋషి ఋణములు
జంతువులు కూడా పిల్లల్ని కంటాయి. వాటిని పెద్ద చేస్తాయి. మరి మనిషికి మామూలు జంతువులకు వ్యత్యాసం ఏమిటి? అదే విద్య. మనిషిని ఒక జంతువు నుండి వేరు చేసేదే విద్య. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఈ విద్యను ఎవరు నేర్పుతారు. గురువులు, ఆచార్యులు. వారు వ్రాసిన పుస్తకములు. హా! పుస్తకములు డబ్బు పెట్టి కొంటున్నాము కదా! గురువులకు జీతము ఇస్తున్నాము కదా! అంటే సరిపోదు. ఎందుకంటే మనల్ని జంతువులతో వేరు చేసి చూపే గురువుల ఋణమునకు ఎవరు విలువ కట్టలేరు. అందుచేత ఋషి ఋణము కూడా దివ్య ఋణమే అవుతుంది. దానికి పరిష్కారం ఏమిటి?
శక్తితో పచమానేభ్యో దాతవ్యం గృహమేధినా
సంవిభాగశ్చ భూతేభ్యః కర్తవ్యో నుపరోధతః
అర్థము: వంట చేయక భోజనము సంపాదించెడి బ్రహ్మచారి, ఆచార్యులు, సన్యాసి మున్నగువారికి దనకుటుంబ పోషణకు లోపము లేకుండ శక్తికొలది భిక్ష మిడవలయును. వృక్షములు మున్నగు సకలభూతములను నీరుపోయుట మొదలగువానితో దృప్తి సేయవలయును. బ్రహ్మచారి వేదములను అభ్యసించినతరువాత గృహస్తాశ్రమములో చేరి తాను నేర్చుకున్న వేద జ్ఞానమును నలుగురికి ఎరుకపరచవలెను.
అనగా ఒక వ్యక్తి బ్రహ్మచారిగా విద్యను అభ్యసించడమే కాకుండా తాను నేర్చిన విద్యను ఇతరులకు బోధించడము వలన మనకు గల దివ్య ఋషి ఋణము తీరుతుంది.
అథర్వణ వేదములోని ఈ క్రింది శ్లోకం చూడండి.
బ్రహ్మచర్యేతి సమిధా సమీద్ధః కార్ష్ణం వసానో దీక్ష్తితో
దీర్ఘ శ్మృశ్రుః స సద్య ఏతి పూర్వస్మాదుత్తరం
సముద్రం లోకాన్త్సమ్ గృభ్య ముహూరాచరిక్రత్
అర్థం: విద్యాభ్యాసము పూర్తిచేసుకున్న బ్రహ్మచారి అతను అప్పటివరకూ నిత్యము ధరిస్తూ వస్తున్న కృష్ణాజినము, జులపాల జుట్టు విసర్జించి సాధారణ గృహస్థాశ్రమములోనికి ప్రవేశించవలెను. అప్పటి నుండి అతను తాను గురుకులంలో నేర్చుకున్న వేద వేదాంగముల విద్యా విశేషములను నలుగురుని పిలిచి అందరికీ వివరిస్తూ ఉండవలెను.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. )